ఫార్ములా ఈ కార్ రేస్ కేస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది.ఈ విషయంలో కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ ఆమోదముద్ర వేయగా గవర్నర్ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. తాజాగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాయడం దుమారం లేపుతుంది. ఈ ఫార్ములా రేసులో నిధుల దుర్వినియోగం పై విచారణ జరపాలని ఆమె ఏసీబీకి సి ఎస్ లేఖ రాశారు.ఈ లేక తోపాటు గవర్నర్ ఆమోదముద్ర వేసిన కాపీని జత చేసి పంపించారు. అయితే ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ మరింత చిక్కుల్లో పడబోతున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా కేటీఆర్ ను విచారణ అధికారులు అరెస్టు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే,కేటీఆర్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వెనుక ముందు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.కెసిఆర్ ను అదుపులోకి తీసుకుంటే జరగబోయే రాజకీయ పరిణామాలు వాటి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అధికారపక్షం పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది.ఏపీలో గత జగన్ ప్రభుత్వం చంద్రబాబు అరెస్ట్ విషయంలో అనుసరించిన తీరు వల్ల వైసిపి భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చిందని,అటువంటి పొరపాటు ఇక్కడ చేయకూడదని టీ కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ విషయంలో అన్ని కోణాల్లో లెక్కలు వేసుకున్నాకే పక్కాగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. చంద్రబాబు విషయంలో జగన్ పూర్తిగా ఎన్నికలు దగ్గర పడ్డ సమయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజల్లో చంద్రబాబు పట్ల సానుభూతి పెరిగిందని అదే వైసిపికి మైనస్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రేస్ వ్యవహారంలో జరగబోయే పరిణామాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండకుండా ఉండేలా ప్రభుత్వ పక్షం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇంకా ఎన్నికలకు మరో నాలుగు ఏళ్ళు గడువు ఉండగానే కేటీఆర్ ను అరెస్టు చేసిన ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉండకుండా జాగ్రత్త పడవచ్చు అనేది రేవంత్ రెడ్డి సర్కార్ వేస్తున్న వ్యూహంగా తెలుస్తోంది.