ఢిల్లీ హైకోర్టు ఆదేశాల పేరిట జరుగుతున్న అవాస్తవ ప్రచారంపై టీవీ9 నెట్‌వర్క్ వివరణ ఇచ్చింది. ఈ తప్పుడు ప్రచారంచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. “TV9” ట్రేడ్‌మార్క్, కాపీరైట్ నిజమైన యజమానిగా అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCPL) సర్వహక్కులను కలిగి ఉంది. నాలుగు వారాల్లోపు ABCPL రూ.168 కోట్లు శ్రీ రవిప్రకాష్‌కు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు కొన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్‌తో పాటు సోషల్ మీడియా మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమైనది..దీన్ని ఖండిస్తున్నాము. కొన్ని బాధ్యతారహిత మీడియా గ్రూపులు కోర్టు ఆదేశాల పేరిట అవాస్తవాలను ప్రసారం చేయడం పట్ల ABCPL తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది.
మీడియా విలువలను తుంగలో తొక్కి ప్రసారం చేసిన ఇలాంటి అవాస్తవ కథనాలు సామాన్య ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా.. ఆ మీడియా సంస్థల పెయిడ్ జర్నలిజం, అనైతికతకు అద్దంపడుతోంది. ఈ కథనాలు ABCPL పై అపోహలు కలిగించేలా నిరాధారమైన ఆరోపణలతో ఉన్నాయి. ఇలాంటి అవాస్తవ వార్తలను ప్రచారం చేసే వారిపై ABCPL తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తున్నాము అని ఓ ప్రకటన విడుదల చేసింది.