తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పారితోష్ పంకజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా పని చేసిన చెన్నూరి రూపేష్ ను నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేసింది. అయితే సంగారెడ్డి జిల్లాకు వస్తున్న పారితోష్ కు ఎస్పీగా ఇదే ఫస్ట్ పోస్టింగ్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కొత్తగూడెం ఓఎస్డీగా పని చేస్తున్నారు. 2020 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన పంకజ్ బిహార్ రాష్ట్రం భోజ్ పూర్ జిల్లా అరా నగరంలో జన్మించారు. పాఠశాల విద్యను తన సొంత రాష్ట్రంలోనే పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత అతను బీఎస్పీ నాటికల్ సైన్స్ చదివి షిప్పింగ్ కంపెనీలో ఐదేళ్లకు పైగా ఉద్యోగం చేశారు. ఈ క్రమంలో యూపీఎస్సీకి సిద్ధం కావాలని డిసైడ్ అయి ఢిల్లీ బాట పట్టారు. మూడు సార్లు ఇంటర్వ్యూ వరకు వచ్చిన ఆయన నాలుగో ప్రయత్నంలో 142 ర్యాంక్ తో తన కలను నెరవేర్చుకున్నారు.
ఓటమిని గెలుపుగా..
2016 తన తొలి ప్రయత్నం చేసిన పరితోష్ తొలి ప్రయత్నంలోనే చాలా నేర్చుకున్నాను అని ఓ సందర్భంలో చెప్పినట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. నేను రెండవ ప్రయత్నానికి సిద్ధమయ్యే సమయానికి నా సిలబస్ చాలా స్పష్టంగా ఉండటానికి ఇది కారణం అయిందని చెప్పుకొచ్చారు. అలా 2019లో యూపీఎస్సీ క్రాక్ చేసి 2020 బ్యాచ్ లో సెలెక్ట్ అయ్యారు.